Thursday 6 October 2011

మాధవపెద్ది వారి కులదేవత కథ

                                               
ముందుగా బ్లాగర్లకు, పాఠకులకు విజయ దశమి శుభాకాంక్షలు.

గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో  ఉన్న బ్రాహ్మణ కోడూరు మాధవపెద్ది వారి స్వస్థలం. మాధవపెద్ది వారి కులదేవత నాగారుపమ్మ ( నగరపు అమ్మ ). మా వంశకర్తలు నాగేశ్వర శాస్త్రి, అన్నపూర్ణ దంపతులు. సంతానం కలుగకపోవడం వల్ల  ఆ దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి ఒక పిల్లనో పిల్లవాడినో ఇమ్మని ప్రార్థించారు. ఒకరోజు అమ్మ అన్నపూర్ణమ్మగారి కలలో కనబడి  ' నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను ' అన్నది. త్వరలోనె ఆమె ఒక పాముని ప్రసవించింది. ' నాగూ ' అనగానే వచ్చి పాలు తాగేది. ఇంట్లో అందరితోనూ కలిసిపోయేది. కొంత కాలం తరువాత దాలిగుంటలో చుట్టుకొని పడుకొని ఉండగా ఇంట్లో వాళ్ళు చూసుకోకుండా దానిమీద మీద నీళ్ళు కాచడంతో నాగబాల దగ్ధమైపోయింది. రోజంతా కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. అంతలో ఆ రాత్రి నాగబాల కలలో కనిపించి తను వచ్చిన పని నెరవేరిందని, తనను ఖననం చేసిన చోట గుడి కట్టించమని చెప్పింది. ఆమె చెప్పిన విధంగా అదే ప్రదేశంలో ఒక గుడి నిర్మించారు.

ప్రతి కార్తీక పౌర్ణమి నాడు గుళ్ళో అమ్మవారికి ఉత్సవాలు, తెప్పోత్సవం జరుగుతాయి. ఈ ఉత్సవాలలో మాధవపెద్ది కుటుంబీకులే తొలిపూజ చేయడం ఆనవాయితి. ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా గుడికి వెళ్ళీ కానుకలు సమర్పించడం వంశాచారం. కుటుంబంలోని తొలిసంతానానికి ' నాగ ' పేరు పెట్టడం ఆచారంగా మారింది. అలా పెట్టకపోయిన సందర్భాలలో ఆ సంతానం ఏదోక కారణం వల్ల అకాల మరణం చెందడం జరుగుతోంది. అలా మరణించిననవారికి ఉదాహరణ మా అన్నయ్య మాధవపెద్ది రమేష్ చంద్ర ( సినీ నేపథ్య గాయకుడు ). 1993లో ఆగస్టు 9న 46వ యేట అకారణంగానే మరణించాడు. అలాగే మా చిన్నాన్న గోఖలేగారి అమ్మాయి సరోజ 51వ సంవత్సరంలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి.

మా నాన్నగారు  నాగేశ్వరరావు గారు కమ్యూనిస్టు. ఆధునిక భావాలు కలిగి ఉండేవారు. అందువల్ల మా అన్నయ్యకీ, నాకూ బారసాల చెయ్యలేదు. అన్నయ్యని రమేష్ అని పిలిచేవారు. అ  రమేష్ నన్ను సురేష్ అని పిలవడంతో నా పేరు సురేష్ అయిపోయింది. స్కూలు రికార్డుల్లో మా పేర్లు రమేష్ చంద్ర, సురేష్ చంద్ర అయిపోయాయి.

Thursday 15 September 2011

మన సినిమాకి ఎనభయ్యేళ్ళు

                                                     

                     ఈ రోజు తెలుగు సినీ కళామతల్లి ఎనభయ్యో పుట్టిన రోజు. పరిశ్రమలోని అందరికీ పండుగ రోజు. ఈ సందర్భంగా మా కుటుంబంలోని నాలుగు తరాల  కళాకారులు సినీరంగంలో ఉన్నారని చెప్పగలుగుతున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను.
                     నాకు  వరుసకి తాతగార్లైన మాధవపెద్ది వెంకట్రామయ్యగారు, వి. శివరాం గారు టాకీ ప్రారంభమైన తొలినాళ్ళలో కొన్ని తెలుగు చిత్రాలలో నటించారు. వి. శివరాం గారు ప్రముఖ సౌండ్ ఇంజినీర్.
                      మా చిన్నాన్న గోఖలే గరూ కళాదర్శకుడిగా, ఇంకో చిన్నాన్న సత్యం గారు తెలుగు చిత్రసీమకి విలువైన సేవలందించారు. వరుసకి బాబాయైన మాధవపెద్ది రామగోపాల్ గారు కేఎస్ ప్రకాశరావు గారి ' దీక్ష ' లో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ఇదే చిత్రంలో ఆచార్య ఆత్రేయ గారి మొట్టమొదటి పాట ఆయన మీదే చిత్రీకరించబడింది. రామగోపాల్ గారు నర్తనశాల చిత్రానికి, మరికొన్ని చిత్రాలకి సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు.
                     మా అన్నయ్య రమేష్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు పాడారు. ఆయన ప్రొత్సాహంతోనే వెయ్యి సినిమాలకి పైగా కీబోర్డ్ ప్లేయరుగా, యాభైకి పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా నేనూ పరిశ్రమకి నాకు తోచిన సేవలందించాను.
                     నాలుగో తరంలో మా అల్లుడికి స్వయానా అన్నగారి కుమారుడు చి.సుశీంద్రన్ తమిళ చిత్రరంగంలో ప్రసిధ్ధ దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. మ్మ కోడలికి స్వయానా తమ్ముడు చి. మహత్ రాఘవేంద్ర  తమిళంలో ఇప్పుడిప్పుడే కథానాయకుడిగా మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. భగవంతుడు ఇలా సినీ కళామతల్లికి  సేవ చేసే భాగ్యం కల్పించాడు.       

Tuesday 23 August 2011

నా సంగీత యాత్ర 1

పాఠకులకు, బ్లాగర్లకు మాధవపెద్ది సురేష్ నమస్కారం. ' ఇది సరిగమలెరుగని రాగము ' అంటూ సినీ సంగీత ప్రియులకు దగ్గరైన నేను నా సంగీత యాత్రను మీకందరికీ వివరించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగును మొదలుపెట్టాను. ఈ రోజునుంచి అప్పుడప్పుడూ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను. యాభైఐదు సినిమాల నా ప్రస్థానంలోని సుస్వరమైన మజిలీలను గుర్తు చేసుకుంటాను. కొన్ని మధురస్మృతులను మీతో పంచుకుంటాను.

మా అమ్మ వసుంధరాదేవి అప్పట్లోనే కర్నాటక గాత్రం, వీణ, భరతనాట్యం మూడింటిలో డిప్లొమ చేసింది. ఇల్లు, సంగీతమే ఆమెకు సర్వస్వం. నాన్నగారు మాధవపెద్ది నాగేశ్వర రావుగారు విజయవాడలోని ఆంధ్రా సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఇంజినీరుగా పనిచేసేవారు. కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతించేవారు. ఈ ఇద్దరూ నాకు జన్మనిస్తే నాకు గురువై దిశానిర్దేశం చేసినవాడు మా అన్నయ్య రమేష్. నాకు మార్గదర్శిగా నిలిచి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాని బంగారు బాటను వేసిన ఆ అన్నయ్య పుట్టినరోజునే బ్లాగ్లోకం అనే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అర్థాయుష్షుతోనే శలవు తీసుకున్న అన్నయ్య ఙ్ఞాపకం కంట తడి పెట్టిస్తోంది. ఈ రెండు భావాల సమ్మేళనం నన్ను నలభైనాలుగు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తోంది......

అన్నయ్య ఆగస్టు 23 1947లో పుట్టాడు. నేను సెప్టెంబరు 8 1951లో పుట్టాను. అన్నయ్య చిన్నప్పటినుంచే బాగా పాడేవాడు. " భావనాకళాసమితి " లో గాయకుడిగా చేరాడు. సినీ సంగీత కచ్చేరీలలో పాడేవాడు. ఒకసారి వాళ్ళ బృందానికి ఎక్కార్డియన్ వాయించే కలాకారుడు కారణాంతరాల వల్ల రాలేదు. అప్పుడు అన్నాయ్య " నువ్వు హార్మోణియం నేర్చుకోవచ్చు కదా " అన్నాడు. అన్నయ్య అలా అన్నదే తడవుగా మా నాన్నగారు వాళ్ళ ఫ్యాక్టరీ క్లబ్బులో ఉన్న హార్మోణియం పెట్టె తెచ్చి పెట్టారు. సంగీతం నేర్చుకోకపోయినా వినికిడి ఙ్ఞానంతో మొదటిసారిగా " జనగణమన " వాయించగలిగాను. పది పదిహేను రోజుల్లో మొదటి కార్యక్రమంలో పాల్గొన్నాను. అలా పదిహేనేళ్ళ వయసులో 1967లో శ్రీరామనవమి పర్వదినాన వాద్య కళాకారుడిగా సంగీత ప్రపంచంలోని శ్రుతిని అందుకున్నాను. ఆ తరువాత సరిగమల సంచారమే నా సర్వస్వమైంది.

చదువు, కార్యక్రమాలతో రోజులు వేగంగా గడిచిపోయాయి. హార్మోణియం పట్టుకున్న రెండేళ్ళ తరువాత ఎక్కోర్డియన్ కళాకారుడిగా స్థిరపడ్డాను.మా ఆర్కెస్ట్రా నంబర్ వంగా పేరు తెచ్చుకుంది. నాకూ మంచి పేరొచ్చింది. మా బృందంతోనే కాక మాధవపెద్ది-పిఠాపురం వాళ్ళ బృందంతో కూడా విస్తృతంగా పర్యటించాను.1973లో అన్నయ్య మద్రాసెళ్ళిపోయాడు. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. 1972లో బాలుగారు కలకత్తా నుంచి మద్రాసెళుతూ విజయవాడలో జరుగుతున్న మా కార్యక్రమం మధ్యలో అరగంట సేపు పాడారు. అప్పుడు ఆయనకి హార్మోణియం అద్భుతంగా వాయించిన కళాకారుడు రాజయ్య...అదే...మన ఇళయరాజ. 1973 డిసెంబరు నాలుగున నేనూ అన్నయ్యననుసరించాను. '74 మార్చిలో " పరివర్తన " అనే సినిమాకి టీ చలపతిరావుగారి సంగీత దర్శకత్వంలో బాలుగారి పాటకి మొదటిసారి ఎక్కార్డియన్ వాద్య సహకారాన్ని అందించాను. ఆ సినిమాలో చంద్రమోహన్, లక్ష్మిలు హీరోహీరోయిన్లు. కె. హేమాంబరధరరావుగారు దర్శకుడు.

'75లో సూట్ కేసనుకొని ఎవరో నా ఎక్కార్డియన్ ని కొట్టేశారు. అప్పుడు కీబోర్డ్ అద్దెకు తీసుకొని సినిమాలలో అదే వాయించాను. అంచెలంచెలుగా ఎదిగి సంగీత దర్శకుడినయ్యాను, రాత్రికి రాత్రే అయిపోలేదు.

'67లో ఆనాడు శ్రీరామనవమి రోజున అందుకున్న పారితోషికం ఇరవై రూపాయలు. '73లో కూడా అరవై రూపాయల పారితోషికం తీసుకున్నాను. '74లో జెమిని స్టూడియోలో రికార్డైన " పరివర్తన " పాటకి నేనందుకున్నది డెభ్భై ఐదు రూపాయలు. అటుపైన కొద్ది కొద్దిగా పారితోషికం పెరుగుతూ వచ్చింది. సంగీత దర్శకుడిగా నేనందుకున్న అడ్వాన్సు పదివేలు, మొత్తం యాభైవేలు.