Tuesday, 23 August 2011

నా సంగీత యాత్ర 1

పాఠకులకు, బ్లాగర్లకు మాధవపెద్ది సురేష్ నమస్కారం. ' ఇది సరిగమలెరుగని రాగము ' అంటూ సినీ సంగీత ప్రియులకు దగ్గరైన నేను నా సంగీత యాత్రను మీకందరికీ వివరించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగును మొదలుపెట్టాను. ఈ రోజునుంచి అప్పుడప్పుడూ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను. యాభైఐదు సినిమాల నా ప్రస్థానంలోని సుస్వరమైన మజిలీలను గుర్తు చేసుకుంటాను. కొన్ని మధురస్మృతులను మీతో పంచుకుంటాను.

మా అమ్మ వసుంధరాదేవి అప్పట్లోనే కర్నాటక గాత్రం, వీణ, భరతనాట్యం మూడింటిలో డిప్లొమ చేసింది. ఇల్లు, సంగీతమే ఆమెకు సర్వస్వం. నాన్నగారు మాధవపెద్ది నాగేశ్వర రావుగారు విజయవాడలోని ఆంధ్రా సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఇంజినీరుగా పనిచేసేవారు. కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతించేవారు. ఈ ఇద్దరూ నాకు జన్మనిస్తే నాకు గురువై దిశానిర్దేశం చేసినవాడు మా అన్నయ్య రమేష్. నాకు మార్గదర్శిగా నిలిచి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాని బంగారు బాటను వేసిన ఆ అన్నయ్య పుట్టినరోజునే బ్లాగ్లోకం అనే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అర్థాయుష్షుతోనే శలవు తీసుకున్న అన్నయ్య ఙ్ఞాపకం కంట తడి పెట్టిస్తోంది. ఈ రెండు భావాల సమ్మేళనం నన్ను నలభైనాలుగు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తోంది......

అన్నయ్య ఆగస్టు 23 1947లో పుట్టాడు. నేను సెప్టెంబరు 8 1951లో పుట్టాను. అన్నయ్య చిన్నప్పటినుంచే బాగా పాడేవాడు. " భావనాకళాసమితి " లో గాయకుడిగా చేరాడు. సినీ సంగీత కచ్చేరీలలో పాడేవాడు. ఒకసారి వాళ్ళ బృందానికి ఎక్కార్డియన్ వాయించే కలాకారుడు కారణాంతరాల వల్ల రాలేదు. అప్పుడు అన్నాయ్య " నువ్వు హార్మోణియం నేర్చుకోవచ్చు కదా " అన్నాడు. అన్నయ్య అలా అన్నదే తడవుగా మా నాన్నగారు వాళ్ళ ఫ్యాక్టరీ క్లబ్బులో ఉన్న హార్మోణియం పెట్టె తెచ్చి పెట్టారు. సంగీతం నేర్చుకోకపోయినా వినికిడి ఙ్ఞానంతో మొదటిసారిగా " జనగణమన " వాయించగలిగాను. పది పదిహేను రోజుల్లో మొదటి కార్యక్రమంలో పాల్గొన్నాను. అలా పదిహేనేళ్ళ వయసులో 1967లో శ్రీరామనవమి పర్వదినాన వాద్య కళాకారుడిగా సంగీత ప్రపంచంలోని శ్రుతిని అందుకున్నాను. ఆ తరువాత సరిగమల సంచారమే నా సర్వస్వమైంది.

చదువు, కార్యక్రమాలతో రోజులు వేగంగా గడిచిపోయాయి. హార్మోణియం పట్టుకున్న రెండేళ్ళ తరువాత ఎక్కోర్డియన్ కళాకారుడిగా స్థిరపడ్డాను.మా ఆర్కెస్ట్రా నంబర్ వంగా పేరు తెచ్చుకుంది. నాకూ మంచి పేరొచ్చింది. మా బృందంతోనే కాక మాధవపెద్ది-పిఠాపురం వాళ్ళ బృందంతో కూడా విస్తృతంగా పర్యటించాను.1973లో అన్నయ్య మద్రాసెళ్ళిపోయాడు. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. 1972లో బాలుగారు కలకత్తా నుంచి మద్రాసెళుతూ విజయవాడలో జరుగుతున్న మా కార్యక్రమం మధ్యలో అరగంట సేపు పాడారు. అప్పుడు ఆయనకి హార్మోణియం అద్భుతంగా వాయించిన కళాకారుడు రాజయ్య...అదే...మన ఇళయరాజ. 1973 డిసెంబరు నాలుగున నేనూ అన్నయ్యననుసరించాను. '74 మార్చిలో " పరివర్తన " అనే సినిమాకి టీ చలపతిరావుగారి సంగీత దర్శకత్వంలో బాలుగారి పాటకి మొదటిసారి ఎక్కార్డియన్ వాద్య సహకారాన్ని అందించాను. ఆ సినిమాలో చంద్రమోహన్, లక్ష్మిలు హీరోహీరోయిన్లు. కె. హేమాంబరధరరావుగారు దర్శకుడు.

'75లో సూట్ కేసనుకొని ఎవరో నా ఎక్కార్డియన్ ని కొట్టేశారు. అప్పుడు కీబోర్డ్ అద్దెకు తీసుకొని సినిమాలలో అదే వాయించాను. అంచెలంచెలుగా ఎదిగి సంగీత దర్శకుడినయ్యాను, రాత్రికి రాత్రే అయిపోలేదు.

'67లో ఆనాడు శ్రీరామనవమి రోజున అందుకున్న పారితోషికం ఇరవై రూపాయలు. '73లో కూడా అరవై రూపాయల పారితోషికం తీసుకున్నాను. '74లో జెమిని స్టూడియోలో రికార్డైన " పరివర్తన " పాటకి నేనందుకున్నది డెభ్భై ఐదు రూపాయలు. అటుపైన కొద్ది కొద్దిగా పారితోషికం పెరుగుతూ వచ్చింది. సంగీత దర్శకుడిగా నేనందుకున్న అడ్వాన్సు పదివేలు, మొత్తం యాభైవేలు.
34 comments:

 1. "మధురమే సుధాగానం!" :)

  తెలుగు బ్లాగు ప్రపంచానికి స్వాగతమండీ!

  ReplyDelete
 2. స్వాగతం సుస్వాగతం సురేష్ గారు..

  ReplyDelete
 3. బ్లాగు ప్రపంచానికి స్వాగతం, సురేష్ గారూ. సినిమా ఇండస్ట్రిలో మీరు ఎదుర్కొన్న బోలెడన్ని అనుభవాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 4. మాధవపెద్ది సురేష్ గారూ !
  ఇప్పటివరకూ సాహిత్యం, ఇతర అంశాలతో నిండిన బ్లాగు ప్రపంచంలో సంగీతం పలికించడానికి వస్తున్న మీకు స్వాగతం.

  ReplyDelete
 5. మాధవపెద్ది గారూ
  స్వాగతం
  వివాహ భోజనంబు.... హహ్హహహ్హహాఆ .... లాంటి
  టపాలతో మమ్మల్ని అలరించండి.

  ReplyDelete
 6. బ్లాగు ప్రపంచానికి స్వాగతం సురేష్ గారూ.సినిమా పరిశ్రమలో మీ అనుభవాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 7. సురేష్ గారూ, నమస్తే! మీ బృందావనం పాటలు అద్భుతంగా కుదిరాయండీ! ఇన్నేళ్ళయినా మా ఇంట్లో ఈ పాటలు ఇంకా మారు మోగుతుంటాయి. ముఖ్యంగా మధురమే సుధాగానం పాటలో పాట ఎలా కంపొజ్ చేయొచ్చో చూపించారు చూడండి...అది అమోఘంగా ఉంటుంది. అందులో పాటలన్నీ నాకు చాలా చాలా ఇష్టం!

  మీ అనుభవాలతో మాకు తెలీని మరిన్ని విషయాలు తెలుసుకుంటామన్న మాట! ఎక్స్ లెంట్!

  ReplyDelete
 8. ఆర్కే గారు, జ్యోతి గారు, భాస్కర్ గారు, రావు గారు, ఆత్రేయ గారు, స్రీనివాస్ గారు,

  ఇంత హార్థికంగా నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు.

  సురేష్.

  ReplyDelete
 9. సుజాత గారు,

  మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ వంటివారందరూ ప్రోత్సహించబట్టే 55 సినిమాలకు పని చేయగలిగాను. ఇప్పుడు తమిళ పరిశ్రమలో తొలి అడుగు వేయబోతున్నాను.

  ReplyDelete
 10. సురేష్ గారూ! మీది సరిగమలెరిగిన రాగం! మీ సంగీత యాత్రానుభవాలనూ, స్వరకల్పనానుభూతులనూ ఇలా అక్షరాలుగా పొదిగి అందిస్తుండండి.. చదివి ఆనందిస్తాం!

  ReplyDelete
 11. సురేష్ గారూ బ్లాగ్లోకం లోకి సాదర స్వాగతం.

  ReplyDelete
 12. చాలా సంతోషమండీ సురేష్ గారు.జ్యోతి గారి పుణ్యమా అని మీ బ్లాగు చూట్టం మొదలుపెట్టాము.మీరు బ్రాహ్మణకోడూరు నుంచి మొదలుపెట్టుకుని రావాలని నా కోరిక.

  ReplyDelete
 13. సురేష్ గారూ, నమస్తే..
  ఆత్మకథా రచనకి బ్లాగుని వేదికగా చేసుకోవడం బాగుంది.. మీ ద్వారా ఆనాటి సంగీతం, పరికరాలు, సౌకర్యాలు, సంగీతం పట్ల అప్పటి సినిమా బృందాల వైఖరి.. కాలంతో పాటుగా వేగంగా వచ్చిన మార్పులు.. ఇవన్నీ తెలుసుకోవచ్చునని ఆశిస్తున్నాను.. చక్కని ప్రారంభం.. కొనసాగించండి.. అభినందనలతో..

  ReplyDelete
 14. సురేష్ గారూ, బ్లాగు ప్రపంచానికి హార్దిక స్వాగతం.
  సంగీతమంటే ఆసక్తి ఉన్న మాకు మీ అనుభవాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొదలెట్టండి.

  అన్నట్టు మీ బృందావనం పాటలు నాకు చాలా ఇష్టం.

  ReplyDelete
 15. సురేష్ గారు బ్లాగులోకానికి స్వాగతం..మొన్నే మీ ప్రోగ్రాం సప్తగిరి లో చూసాను.."భళి భళి భళి భళి దేవా" మీరు కీబోర్డ్ మీద అద్భుతంగా పలికించారు..అలాగే మీ ఙ్ఞాపకాలు చెప్తూ మాధవపెద్ది సత్యం గారు మీకు 20 రూపాయలు పారితోషకం ఇస్తూ చెప్పిన మాటలు అమోఘం..అవి మీరు ఇప్పటికి పాటిస్తున్నందుకు మీకు వారి ఎడల ఉన్న గౌరవం విదితమౌతున్నది..మరిన్ని విషయాలు మాతో పంచుకుంటారని ఆశిస్తూ..

  ReplyDelete
 16. వేణు గారు, తప్పకుండా.
  శంకర్ గారు, ధన్యవాదాలు.
  రాజేంద్రకుమార్ గారు, మీరు కోరినట్టుగా ఆ విషయాలన్నీ వివరిస్తాను.
  మురళి గారు, ధన్యవాదాలు. మీరడిగినవన్నీ తప్పకుండా తెలుపుతాను.
  ఆ.సౌమ్య గారు, ధన్యవాదాలు. సంగీత కుటుంబంలోని మీ వంటి వారికి కూడా బృందావనం పాటలు నచ్చటం నా అదృష్టం.
  నైమిష్ గారు, నిజమే. పెద్దలంటే నిజంగా నాకు గౌరవం. ధన్యవాదాలు.

  ReplyDelete
 17. సురేష్ గారూ, బ్లాగు ప్రపంచానికి స్వాగతం!!!

  ReplyDelete
 18. సునీత గారు, ధన్యవాదాలు.

  ReplyDelete
 19. స్వాగతం సురేష్ గారు :) చిన్నప్పటి నుండి మీ పాటలు వింటూ, మీ గురించి చాలా చానల్స్ లో ప్రోగ్రామ్స్ చూస్తూ పెరిగాను :) ఇక నుండి మీతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాన్ని కల్పించి నందుకు ధన్యవాదాలు :) మీ పాటల్లాగే , మీ బ్లాగ్ ప్రయాణం కూడా హాయిగా సాగిపోతూ మమ్మల్ని అలరిస్తారని కోరుకుంటున్నా.

  ReplyDelete
 20. సురేష్ గారు, చాలా సంతోషం. మీ అనుభవాలు ఆలోచనలు చదవాలని కుతూహలంగా ఉన్నది.

  ReplyDelete
 21. విరిబోణి గారు, ఇంతగా అభిమానిస్తున్న మీతో నేరుగా సంభాషించడం నాక్కూడా ఆనందాన్నిస్తోంది.
  కొత్తపాళీ గారు, ధన్యవాదాలు.

  ReplyDelete
 22. మాధవపెద్ది సురేష్ గారూ!
  బ్లాగుప్రపంచంలోకి మీకు స్వాగతం.

  ReplyDelete
 23. సురేష్ గారు, నమస్కారం. మీ 'సంగీత స్వరాలు' మాత్రమే వింటున్న నాలాంటి వాళ్ళకు ప్రత్యక్షంగా మీ స్వరాన్ని కూడా వినిపిస్తున్నందుకు ధన్యవాదములు.
  మీ అనుభవాలు చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని భావిస్తున్నాను.

  ReplyDelete
 24. సుధాకర్ గారు, శ్రీ గారు,
  ధన్యవాదాలు.

  ReplyDelete
 25. http://visakhateeraana.blogspot.com/2011/09/blog-post_08.html

  ReplyDelete
 26. రాజేంద్ర కుమార్ గారు,
  ధన్యవాదాలు.
  త్వరలోనే మీరడిగినట్టుగా ' బ్రాహ్మణకోడూరు నుంచి మొదలుపెట్టబోతున్నాను.

  ReplyDelete
 27. ' బ్రాహ్మణకోడూరు నుంచి

  ------------------------------
  హ్మ్ ! naa అజ్ఞానానికి మన్నించండి మీది బ్రాహ్మణకోడూరా , మాధవపెద్ది సత్యం గారు మీకు చుట్ట్టాలని తెలుసు కానీ మీకు ఏమవుతారు వారు ? నేను వారిని చూసానండి నేను చాలా చిన్నప్పుడు :)))

  మిమ్మల్ని ఈ ఊరు పేరు తో కలవటం మహా సంతోషం గా ఉంది :))))

  ReplyDelete
 28. శ్రావ్య గారు,
  సంతోషం.
  మా స్వస్థలం అదే.

  ReplyDelete
 29. కానివ్వండి సురేష్ గారు ఇక్కడ వెయిటింగ్ మేము.

  ReplyDelete
 30. సురేష్‌గారూ,
  మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది.

  భైరవద్వీపంలో ఎంత మంచి పాటలు చేసారు సార్. సంగీత ప్రియులున్నంత కాలం బ్రతికే పాటలు చేసారు. నిజానికి ఇండస్ట్రీ మీకు ఇంకా ఎన్నో అవకాశాలివ్వాలి. మీ అనుభవాలు చదవటానికి ఆసక్తిగా ఎదురుచూస్తాం.

  ReplyDelete
 31. "మీరేనా" అనుకుంటూ వచ్చాను. చూస్తే మీరే :).
  మీ అనుభవాలు తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నది.

  ReplyDelete
 32. సురేష్ గారూ బ్లాగ్లోకం లోకి సాదర స్వాగతం.
  మీ అనుభవాలను, మీ సినీ సంగీత ప్రపంచంలోని మధురానుభవాలను మాతో పంచుకొబొతున్నందుకు చాలా సంతొషంగా వుంది

  ReplyDelete
 33. నమస్కారం సురేష్ గారూ
  ఏవేవో బ్లాగులు చూస్తుంటే ఈ బ్లాగు కంటపడింది.
  కులాసాగా ఉన్నారా?, పిల్లలు కుశలమా?

  ReplyDelete
 34. hii.. Nice Post Great job.

  Thanks for sharing.

  Best Regarding.

  More Entertainment

  ReplyDelete

Follow by Email